Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు సబ్సిడీతో కూడిన రుణాలివ్వనున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన లేకపోవడంతో యువత తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. ఏటా 25 వేల మందికి ఉపాధి యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ధ్యేయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి కల్పనకు, ఉద్యోగాల భర్తీకి నడుం బిగించిందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో రుణాలు విరివిగా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. విద్యతో సంబంధం లేకుండా నిరక్షరాస్యులకు కూడా ఈ రుణాలివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలివ్వనున్నామని తెలిపారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఈ రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, విక్రయాలకు సంబంధించి యూనిట్లకు రుణాలివ్వబోమని చెప్పారు. ఏటా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా 25 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు. జిల్లాకో ట్రైనింగ్ సెంటర్ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లాకో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా సబ్సీడీ యూనిట్లపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణా కేంద్రాల్లో యూనిట్ల స్థాపనకు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. సబ్సీడీ రుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
Admin
Studio18 News