Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan : రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు, చాలా ఛాలెంజస్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి విపత్తు వచ్చింది. బుడమేరు కాలువ 90శాతం ఆక్రమణలో ఉంది. ఆక్రమణల వల్లే బుడమేరు సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. వాగులు వెళ్లే దారిలో ఆక్రమణలు చెయ్యడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఆక్రమణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వరదలు ముంచెత్తడంతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు రాత్రిపగలు తేడాలేకుండా పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ.. వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని పవన్ అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు అందించడం జరుగుతుందని చెప్పారు. వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానుకొని సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలి. ముందు వైసీపీ సహాయంచేసి అప్పుడు మాపై విమర్శలు చేయండి. ఇళ్లలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని వైసీపీ నేతల తీరును పవన్ విమర్శించారు. నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారుల సూచనతో నేను వెనక్కి తగ్గాను. అలాఅని నేను ఏమీ చేయడం లేదని అనడం సరికాదు. పవన్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించే వైసీపీ నేతలు నాతో ఒక్కసారి వచ్చి చూడండి.. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుందంటూ పవన్ అన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేలా రాజకీయ నాయకులు ప్రవర్తించాలి. ఇప్పటికైనా విమర్శలు మానుకొని వైసీపీ నేతలు ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయం అందించాలని పవన్ సూచించారు.
Admin
Studio18 News