Studio18 News - ANDHRA PRADESH / : వరద బాధితుల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాతృత్వాన్ని సీఎం చంద్రబాబు కొనియాడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ భారీ మొత్తంలో విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. దీనిపై పవన్ స్పందించారు. మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించారు అంటూ సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. "అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ అనేవి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం వచ్చి పడింది. వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు (చంద్రబాబు) కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇటువంటి కష్ట సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ యుద్ధప్రాతిదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన తాలూకు ఫొటోలను కూడా పవన్ పంచుకున్నారు.
Admin
Studio18 News