Studio18 News - ANDHRA PRADESH / : ఫ్లాట్‌ఫాంపై బస్సులు నిలిపే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య తలెత్తిన గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇద్దరూ పరస్పరం బూతులు తిట్టుకుంటూ దాడిచేసుకున్నారు. ప్రయాణికులు విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ నెల 6న జరిగిందీ ఘటన. జమ్మలమడుగు బస్సు ప్లాట్‌ఫాంపై ఆగి ఉండగా కల్యాణదుర్గం బస్సు డ్రైవర్ సీటు వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. ఆపై మాటల తీవ్రత పెరగడంతో బస్సులోకి దూసుకెళ్లి డ్రైవింగ్ సీట్లో ఉన్న జమ్మలమడుగు డ్రైవర్‌ను కాలితో విచక్షణ రహితంగా తన్నాడు. దీంతో అతడు కూడా సీట్లోంచి లేచి కల్యాణదుర్గం డ్రైవర్‌పై దాడిచేశాడు. ఇద్దరూ బస్సులోనూ కలబడ్డారు. ఆ సమయంలో బస్సు ఇంజిన్ ఆన్‌లో ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వారిద్దరూ అలా పోట్లాడుకుంటూ పొరపాటున క్లచ్‌పై పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. వారి గొడవతో బస్టాండ్‌లో గందరగోళం నెలకొంది. ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆ తర్వాత డ్రైవర్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారు.
Admin
Studio18 News