Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods : విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్ నగర్, విద్వాధరపురం, భవానీ పురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణ ప్రాంతాలైన అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లోకి మళ్లీ వరద నీరు పెరిగింది. ఒక్కసారిగా కాలనీల్లో రెండు అడుగులకు వరద నీరు పెరిగింది. దీంతో స్థానిక ప్రజలు వణికిపోతున్నారు. అయితే, మరో మూడు రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొనడంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే కురిసిన కుండపోత వర్షానికితోడు బుడమేరుకు గండ్లు పడటంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడిప్పుడు ముంపు నుంచి తేరుకుంటున్న సమయంలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన పెను తుపాను ‘యాగి’ చైనా పరిసర దేశాల్లో బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘యాగి’ ప్రభావంతోనే ఉత్తర దిశగా కదులుతుందని, తద్వారా రాష్ట్రానికి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యాగి తుపాను ప్రభావంతో ఉత్తర దిశగా కదులుతున్న అల్పపీడనం ప్రభావంతో సోమవారం నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా బలపడనుంది. తద్వారా మూడు నుంచి నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (శనివారం) .. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Admin
Studio18 News