Studio18 News - ANDHRA PRADESH / : Ram Mohan Naidu Kinjarapu: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులను వేగవంతం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. లోక్‌సభలో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రూ. 611 కోట్ల అంచనాలతో విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు 2020, జూన్‌లో ప్రారంభయ్యాయి. కరోనా సహా.. రాష్ట్రంలో నెలకొన్న ఇతర కారణాల రీత్యా కూడా పనులు ఆలస్యం అయ్యాయి. నిర్మాణాలకు అవసరమైన ఇసుక లభించక కూడా ఆలస్యం జరిగింది. విజయవాడ విమానాశ్రయం పనులు ప్రాధాన్యత కింద చేపడుతున్నాము. 2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత పదేళ్లలో పౌర విమానయాన రంగ మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. పదేళ్ల క్రితం రైల్వే శాఖకు ఉన్న డిమాండ్ ఇప్పుడు విమానయాన రంగం వైపు మళ్లింది. దాదాపు ప్రతి సభ్యుడు తమకు విమానాశ్రయం, విమానయాన అనుసంధానం అడిగే పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతంలో విజయవాడ నుంచి ముంబైకి రెండు విమాన సర్వీసులు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని ఎంపీ బాలశౌరి కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, ముంబైకి విమానాలు నడపాలని.. ఢిల్లీ నుంచి విశాఖపట్నం, తిరుపతికి విమాన సర్వీసులు పెంచాలని సూచించారు. విజయవాడ నుంచి కొలంబో, థాయిలాండ్, సింగపూర్ దేశాలకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.విమాన సర్వీసులు పెంచే విషయంలో జోక్యం చేసుకోవడానికి తమ మంత్రిత్వ శాఖకు అధికారం లేదని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని.. తమ మంత్రిత్వ శాఖ కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించగలుగుతుందని చెప్పారు. సభ్యుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను సానుకూలంగా స్వీకరించి.. వాటిని సంబంధిత సంస్థలకు పరిశీలించాలని పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
Admin
Studio18 News