Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము ఆదివారం డాలస్‌లో పర్యటించారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా తొలుత ఇర్వింగ్ పట్టణంలోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు ఆయనకు మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల ఘనస్వాగతం పలికారు. శాసనసభ్యుడు రాము బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. తాను ఎంతో కాలంగా ఈ మెమోరియల్ గురించి వింటున్నానని, కానీ ఇప్పటి వరకు రాలేకపోయానని తెలిపారు. 2014లో స్థాపించిన ఈ మెమోరియల్ అమెరికాలోనే అతిపెద్దది కావడం, ఇప్పుడు పదో వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంతాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రవాస భారతీయులందరూ ఐకమత్యంతో కలసి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని అనడానికి ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. దీనిని ఒక రోజులో నిర్మించలేదని, డాక్టర్ ప్రసాద్ తోటకూర దూరదృష్టితోనే అది సాధ్యమైందని, అధికారులను ఒప్పించేందుకు దాదాపు ఐదేళ్లు కష్టపడ్డారని గుర్తుచేశారు. ఈ నిర్మాణంలో సహకరించిన బోర్డ్ సభ్యులు రావు కల్వాల, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, ఎంవీఎల్ ప్రసాద్, బీఎన్ రావు మొదలైన కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. మన దేశం నుంచి వివిధ పార్టీలకు చెందిన ఎందరో రాజకీయనాయకులు, ప్రముఖులు ఈ మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచమంతా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత వాతావరణంలో మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆశయాల గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాము అన్నారు. పరస్పర అవగాహన, గౌరవం, చర్చల ద్వారా ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న శాంతి కాముకుడు గాంధీజీ ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రవాసులుగా స్థిరపడిన వారందరూ మాతృదేశ అభివృద్ధికి వీలైనంతగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, వెనిగండ్ల రాము అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Admin
Studio18 News