Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు లోతట్టు ప్రాంతాలకు జేసీబీ ఎక్కి వెళ్లడం తెలిసిందే. అయితే, వైసీపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ చంద్రబాబు సమర్థవంతంగా పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. మామూలుగా చేరలేని ప్రాంతాలకు... ఈ వయసులోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు బుల్డోజర్లు ఎక్కి, పొక్లెయినర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి వెళుతున్నారని కితాబిచ్చారు. దీన్ని అభినందించాల్సింది పోయి, విమర్శించడం సరికాదని, ఈ పద్ధతి మార్చుకోవాలని వైసీపీ నేతలకు పవన్ హితవు పలికారు. "వైసీపీ నాయకులకు నా విజ్ఞాపన, నా విన్నపం. ఇది విమర్శించేందుకు సమయం కాదు. ఇది మనందరి ఉమ్మడి సమస్య... రాష్ట్ర సమస్య ఇది. మీరు కూడా బయటికి వచ్చి, నడుం వంచి సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పిలుపునిచ్చారు.
Admin
Studio18 News