Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : CPI Narayana on YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ సీనియర్ నాయకుడు కె నారాయణ విమర్శలు గుప్పించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని జగన్ అవహేళన చేస్తున్నారని దుయ్యబట్టారు. 11 సీట్లు వస్తే అసెంబ్లీకి పోను.. 170 వస్తేనే పోతానంటే ఎట్టా కుదురుతుందని జగన్‌ను ప్రశ్నించారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఒక ఫ్లాప్ షో అని, 2 నెలలకే ఏపీలో రాష్ట్రపతి పరిపాలన కోరడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబును సొంత జిల్లాలో అడుగుపెట్టనీయకుండా రాజకీయం చేసింది జగనేనని ఆరోపించారు. రికార్డుల కాల్చివేత వెనుక కుట్ర మదనపల్లెలో ప్రభుత్వ ఫైళ్ల దగ్గంపై స్పందిస్తూ.. ప్రభుత్వం మారిన వెంటనే రికార్డుల కాల్చివేతకు శ్రీకారం చుట్టారు ఇందులో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దైర్యంగా, నిజాయితీగా పనిచేయాలని.. తప్పు చేసి ఇబ్బందులు పడొద్దని హితవు పలికారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నారాయణ అభిప్రాయపడ్డారు. నిర్మల సీతారామన్ అబద్దాలు కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చింది అప్పు మాత్రమేనని.. ఏపీకి ఏదో ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అందంగా అబద్దాలు చెబుతున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రాకపొతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. వయనాడ్ విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని, మానవత్వంతో ఆలోచించి ఆర్ధికంగా కేంద్రం ఆదుకోవాలని కోరారు. బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి ఒక గుణపాఠమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని.. ఇప్పుడు అదే తప్పును కాంగ్రెస్ పార్టీ చేస్తోందని అభిప్రాయపడ్డారు.
Admin
Studio18 News