Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారయినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా, నంద్యాల, జగ్గయ్యపేటలలో జరిగిన ఘటనలను ఉదాహరిస్తూ ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠా పాలన కనిపిస్తోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. జనం ఛీకొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్ లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. త్వరలో వైసీపీ ఆఫీసుకు టు-లెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ను అయిదేళ్లలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది జగన్ కాదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకూ దాడులు, దౌర్జన్యాలు జరగని రోజే లేదని అచ్చెన్న విమర్శించారు.
Admin
Studio18 News