Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Srisailam Heavy Rains : నంద్యాల జిల్లా శ్రీశైలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. రాత్రి సమయం కావడం, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపైకి పెద్దపెద్ద బండరాళ్లు పడిపోవటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అయితే, బుధవారం ఉదయాన్నే ఘటన స్థలికి చేరుకున్న అధికారులు ప్రొక్లెయిన్లతో బండరాళ్లను తొలగించే పనులు ప్రారంభించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యారు. శ్రీశైలం ప్రాంతంలోని పాతాళగంగకి వెళ్లే మెట్ల దారికూడా వర్షం నీటితో నిండుకుపోయింది. లలితాంభిక షాపింగ్ కాంప్లెక్స్ లోకి పెద్దఎత్తున నీరు చేరింది. కొత్తపేట శ్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నల్లమల్ల అటవీ ప్రాంతం ఆనుకొని ఉన్న కాలనీలో వర్షపు నీరు అధికంగా రావడంతో కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Admin
Studio18 News