Studio18 News - ANDHRA PRADESH / : మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అవసరమైనప్పుడు భద్రత పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అంబటి రాంబాబు అన్నారు. కానీ, ఇవాళ అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని, జగన్ అధికారం నుంచి దిగిపోయాక ఆయనపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సార్సీ (సెక్యూరిటీ రివిజన్ కమిటీ) నివేదిక రాకముందే, జగన్ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ నివాసం గేటు వద్ద ఉన్న సెక్యూరిటీని తీసేశారని, ఆ రోడ్డులోకి విచ్చలవిడిగా అందరినీ అనుమతించారని వివరించారు. కూటమి కార్యకర్తలను పంపించి ఆ గేటు వద్ద గొడవలు చేయించారని, అభాసుపాలుజేసేందుకు అన్యాయంగా ప్రయత్నించారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆయనను పలుచన చేసేందుకు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారని వెల్లడించారు. "ఇటీవల ఒకాయన మాట్లాడుతున్నాడు... జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప పార్టీ నాశనం కాదు అని ఆయన అంటున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత... మళ్లీ మీరు భద్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్న తర్వాత... ఆయన భద్రతను గాలికి వదిలేసి... ఆయనను ఏదో ఒక విధంగా ప్రమాదంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే మేం ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది" అని అంబటి రాంబాబు వివరించారు.
Admin
Studio18 News