Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని త్వరలో అధికారులు కూల్చేస్తారంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడిపత్రి నుంచి భారీ ర్యాలీగా వచ్చి అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో గత ఐదేళ్లలో తనపై అనేక అక్రమ కేసులు పెట్టారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ”తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమంగా ఇల్లు నిర్మించారు. పెద్దారెడ్డి ఇంటిని మున్సిపాలిటీ అధికారులు కూల్చేస్తారు. త్వరలో మున్సిపాలిటీ అధికారులు ఆయన నోటీసులు ఇస్తారు. పెద్దారెడ్డి వేల కోట్లు అక్రమంగా సంపాదించాడు. మా ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయ్యింది తట్టుకోలేక అప్పుడే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు ఎలా తట్టుకుంటారు? మమ్మల్ని మీరు 5 సంవత్సరాలు వేధించినా భరించాం. చంద్రబాబు మంచోడు కాబట్టి మిమ్మల్ని వదిలేశాడు. ఇప్పటికైనా చంద్రబాబును జగన్ క్షమాపణ కోరాలి.నాపై తప్పుడు కేసులు పెట్టించిన మాజీ మంత్రి పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపీఎస్ సీతా రామాంజనేయులు, డీసీసీ ప్రసాదరావుపై విచారణ జరపాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి. నా గన్‌మెన్లను వెనక్కి పంపించాను. మాకు న్యాయం జరిగిన తర్వాతే… గన్‌మెన్లను తీసుకుంటాం. నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు అమ్ముడుపోని వారికి కూడా గత ప్రభుత్వం గన్‌మెన్లను ఇచ్చింది. ఎవరికి పడితే వాళ్లకు గన్‌మెన్లను ఇవ్వకూడద”ని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Admin
Studio18 News