Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో 17 మంది మృతిచెందారు. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. దాంతో కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కంపెనీ పరిసరాలలో భయానక దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై వైసీపీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించింది. ప్రమాదం గురించి కనీసం సమాచారాన్ని కూడా తీసుకోలేని అలసత్వంతో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించింది. ఇది పాలనలో చంద్రబాబు బేలతనానికి నిదర్శనం అని.. 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం అని మండిపడింది. అచ్యుతాపురం అగ్నిప్రమాదంపై ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరించిందంటూ విమర్శించింది. ఘటన జరిగిన సుమారు 5 గంటల తర్వాత సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాశ్ ప్రెస్ మీట్ పెట్టారని పేర్కొంది. ముగ్గురు మాత్రమే చనిపోయారని, 25 మందికి మాత్రమే గాయాలు అయ్యాయని ఘటనను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. వివరాలు ఇంకా తెలియాల్సి వుందనే క్లారిటీ లేని కామెంట్ చేశారని చెప్పుకొచ్చింది. ఆ స్థాయిలో ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం దారుణమని పేర్కొంది. అదే ప్రెస్ మీట్‌లో జగన్ ప్రభుత్వంపై పనికిమాలిన ఆరోపణలు చేశారంటూ మండిపడింది. 30 కిలోమీటర్ల దూరంలోని విశాఖకు కాకుండా అనకాపల్లిలోని ఆసుపత్రికి బాధితులను తరలించడం ఏంటని విమర్శించింది. తమను విశాఖపట్నం తీసుకెళ్లాలని బాధితులు వేడుకున్నారని, అనకాపల్లిలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపించారని బాధితులు అధికారుల ముందు గగ్గోలు పెడుతున్నారని వైసీపీ తన ట్వీట్‌లో పేర్కొంది.
Admin
Studio18 News