Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. తాజాగా పెనుమాకలో రాజధాని, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కొందరు రైతులు రెండు రోజుల్లో 2.65 ఎకరాలు ఇచ్చారు. అంతకుమునుపు, రాజధాని భూ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ లాండ్ పూలింగ్ పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చేందుకు ముందుకొస్తున్న రైతుల నుంచి తీసుకోవాలని డిప్యుటీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం లాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. భూసేకరణకు సంబంధించిన ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది. ఇక రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా రాజధాని కోసం భూసేకరణ చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా రైతులు తమ భూములిచ్చేందుకు నిరాకరించడంతో పూలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు, రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రభుత్వ సిబ్బంది కొరత తలెత్తింది. దీంతో, ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై రాజధానికి తీసుకొచ్చేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఓ ప్రకటనలో దరఖాస్తులను ఆహ్వానించారు.
Admin
Studio18 News