Studio18 News - ANDHRA PRADESH / : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తొంది. కృష్ణా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుండటంతో నిన్న సాగర్ గేట్లు ఎత్తి దిగువకు లక్షన్నర క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో గత పది రోజుల క్రితం వరకూ నీరు లేక అడుగంటిన పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఇటీవల కాలం వరకూ పులిచింతలలో జలకళ లేక అడుగున ఉన్న రాళ్లు కనిపించాయి. ప్రస్తుతం పులిచింతలకు సాగర్ టైల్ పాండ్ నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుండి పులిచింతలకు 30,388 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు 26,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.6789 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ఈ రోజు మరి కొన్ని గేట్లు తెరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెద్దగా లేకపోయినప్పటికీ భారీ వరద దృష్ట్యా అధికారులు గేట్లు ఎత్తారు.
Admin
Studio18 News