Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ అధినేద జగన్ పై కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ను భరించలేకే ఆయన ఐదేళ్ల పాలనకు ప్రజలు ముగింపు పలికారని చెప్పారు. అయినప్పటికీ తన పద్ధతిని, నెగెటివ్ యాటిట్యూడ్ ను జగన్ మార్చుకోలేదని విమర్శించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉందనే భావనతోనే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని చెప్పారు. జగన్ ఎక్కడకు వెళితే అక్కడ ప్రజలకు ప్రమాదం ఉంటుందని అన్నారు. విజయవాడ వరదలపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. బుడమేరుకు గేట్లు ఎత్తేశారని, అమరావతి మునిగిపోయిందని అంటున్నారని ఎద్దేవా చేశారు. భారీ వరదల సమయంలో రాజకీయం చేయాలనే ఆలోచన జగన్ కు రావడం దురదృష్టకరమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్తు పరిస్థితిలో డ్రోన్లను ఉపయోగిస్తూ సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని చెప్పారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సహాయం అందించామని తెలిపారు. ఇంత చేస్తున్నా జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు. వరదలను రాజకీయాలకు వాడుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని... తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.
Admin
Studio18 News