Studio18 News - ANDHRA PRADESH / : విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లపై మంగళవారం విచారణ జరిగింది. వచ్చే నెలలో యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. జగన్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరో పక్క విజయసాయి రెడ్డి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయి రెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉండటంతో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీరు కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లారు.
Admin
Studio18 News