Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తుంగభద్ర డ్యామ్ గేటు ఆదివారం కొట్టుకుపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షించారు. అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు. నిర్వహణలో లేని పాతగేటు కొట్టుకుపోయినట్లు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీంను పంపించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎంకు వివరించారు. స్టాప్ లాక్ అరేంజ్‌మెంట్ ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు సూచించారు. తాత్కాలిక గేట్ ఏర్పాటుపై మాట్లాడాలన్నారు. ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఉంటుందని వారికి చెప్పాలన్నారు. అయితే ఇది పాత గేటు కావడంతో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని సీఎంకు పయ్యావుల చెప్పారు. లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయమని ఆదేశించాం డ్యామ్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఘటనాస్థలికి ఇంజినీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లినట్లు చెప్పారు.
Admin
Studio18 News