Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ లీగల్‌సెల్ విభాగంతో వైఎస్ జగన్ సమావేశమై మాట్లాడారు. టీడీపీ నేతలు రెడ్ బుక్‌లో పేర్లు రాసుకున్నారని, ఎవరిని తొక్కాలి, ఎవరిపైకేసులు పెట్టాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలని అందులో రాసుకున్నారని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ తెరవడం మొదలుపెట్టారని, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిల్లో రెడ్‌బుక్‌ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారని అన్నారు. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోసిస్తున్నారని ఆరోపించారు. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారని, వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పారు. గోబెల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు తమదగ్గర లేవని, పెద్దిరెడ్డి మీద ఎలాంటి దారుణాలు చేస్తున్నారో మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లే చేసి, దొంగకేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్‌మీద ఎవరికీ బాధ్యత లేకుండా పోయిందని చెప్పారు. ఎదుటి వాడు మనవాడు కాదనుకుంటే, ఏదైనా చేయొచ్చని సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటికి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు అభయం ఇస్తున్నారని చెప్పారు. నేరం చేయాలంటే భయపడాలని చంద్రబాబు నిన్న అన్నారని తెలిపారు. కానీ తాడిపత్రిలో పోటీచేసిన పెద్దారెడ్డిని అడుగుపెట్టనివ్వకుండా టీడీపీ మూకలన్నీ దాడులు చేశాయని చెప్పారు. టీడీపీ మూకలు అడ్డుకున్నాయి.. ఎక్స్ ఖాతాలోనూ టీడీపీపై జగన్ మండిపడ్డారు. ‘ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?’ అని చెప్పారు.
Admin
Studio18 News