Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : School holidays Rain Effect : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారాయి. విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం తెల్లవారు జాము నుంచి వర్షం పడుతుంది. దీంతో విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీనికితోడు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కోమసీమ జిల్లాలోనూ పాఠశాలలకు, కళాశాలలకు కలెక్టర్ మహేశ్ సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. విజయవాడలోని రహదారులు జలమయం అయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏపీ భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇదిలాఉంటే.. ప్రకాశం బ్యారేజీలోని మొత్తం 70గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు.
Admin
Studio18 News