Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి. రెడ్ బుక్ గురించి ఇవాళ నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా ప్రతి ప్రసంగం గమనించండి... ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పాను. మరోసారి చెబుతున్నాను... చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టను అని చెప్పాను. జోగి రమేశ్ గారి అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూముల పత్రాలు తీసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, అతడి పేరు మీద బదిలీ చేసుకుని, ఆ భూములను అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వారికి రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు. అగ్రిగోల్డ్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూములు అమ్మేసి డబ్బులు సంపాదించాడు... అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? రేపు మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటాం, ఇసుక దందాల్లోనూ చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తే మేం పట్టించుకోకూడదా? ఆ రోజు నేను ఊరూరా రెడ్ బుక్ గురించి మాట్లాడాను, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వారిని నేను వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు అని ప్రజలకు హామీ ఇచ్చాను. ప్రజలకు రెడ్ బుక్ చూపించి మరీ చెప్పాను... అందుకే ప్రజలు మాకు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రెడ్ బుక్ వల్లే మేం గెలిచామని చెప్పడంలేదు... అందరి కృషి వల్ల గెలిచాం... అందులో రెడ్ బుక్ కూడా ఒక భాగం. నేను వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో గెలిచాం... అక్కడ నేను ప్రతి సభలో రెడ్ బుక్ చూపించాను. ఎవరైతే తప్పు చేశారో వారిని వదిలిపెట్టవద్దని ప్రజలు కూడా స్పష్టంగా మాకు తీర్పు ఇచ్చారు" అని నారా లోకేశ్ వివరించారు.
Admin
Studio18 News