Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 77 వేల మంది పదో తరగతి విద్యార్ధులకు ఊరట కలిగేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్ధులకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించారు. అంతర్గత పరీక్షల ఫలితాల ఆధారంగా మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వెయ్యి పాఠశాలలకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్ఈలకు వ్యత్యాసం ఉంటుంది. సీబీఎస్ఈ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయాలి. కానీ గత ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు నేరుగా సీబీఎస్ఈ విధానం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 64 శాతం మంది ఉత్తీర్ణులు కాలేదు. 326 పాఠశాలలో ఒక్క విద్యార్ధీ పాస్ కాలేదు. 556 పాఠశాలల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత శాతం నమోదైంది. 66 పాఠశాలల్లో 26 నుండి 50 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలు చూస్తే విద్యార్ధులు సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులు అయ్యే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని అధికారులు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకురావడంతో ఈ ఏడాది సీబీఎస్ఈ విద్యార్ధులకు రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.
Admin
Studio18 News