Studio18 News - ANDHRA PRADESH / : Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. హత్య రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేశ్‌తో ఆయన చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని, అలాంటిది ఏమైనా ఉంటే కలసి కూర్చుని చర్చించాక నిర్ణయం ఉంటుందని లోకేశ్‌తో చెప్పారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వరరావు.. ఈ భేటీలో పాల్గొన్నారు. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ భేటీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు.సీఎం అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయట పెట్టుకున్నారని పలువురు జనసేన ఎమ్మెల్యేలు అన్నారు.
Admin
Studio18 News