Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన దివ్వెల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందని ఏపీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. అయితే, తాను బయటకు వెళితే తన భార్యాపిల్లలు ఇంటిని కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు. అందుకే ఆసుపత్రికి వెళ్లాలని ఉన్నా వెళ్లడం లేదని వివరించారు. ఈమేరకు సోమవారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డిప్రెషన్ కారణంగానే కారు ప్రమాదం జరిగిందని మాధురి తనతో చెప్పిందన్నారు. దువ్వాడ వాణి వ్యాఖ్యలతో మాధురి కుంగుబాటుకు లోనైందని వివరించారు. వాణి ఆరోపణలు, ఈ గొడవ కారణంగా మాధురి అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికీ దూరమైందని సానుభూతి వ్యక్తం చేశారు. గతంలోనూ తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని చెప్పుకుని బాధపడిందని తెలిపారు. దీనిపై ఇంతకుముందు కూడా మాధురి ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని, తానే కాపాడి ధైర్యం చెప్పానని వివరించారు. మాధురి కారు ప్రమాదం డ్రామా అంటూ జరుగుతున్న ప్రచారంపై దువ్వాడ సీరియస్ గా స్పందించారు. డ్రామా చేయాలని ఎవరూ యాక్సిడెంట్ చేసుకోరని, యాక్సిడెంట్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఏమై ఉండేదని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్ర గాయం అయిందని, ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారన్నారు. కుటుంబ వివాదంపై స్పందిస్తూ.. భార్యాభర్తల మధ్య ఏంజరిగినా సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని, భర్తనే తప్పుబడుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. దువ్వాడ వాణి తండ్రి ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు. తన జీవితంలో ప్రతిక్షణం భార్యతో నరకం చూశానని, పిల్లలను తనపైకి ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వమని తెలిపారు. ఆమె తీరును భరించలేక రెండేళ్ల కిందటే విడాకుల నోటీసు ఇచ్చానని చెప్పారు. నిర్మొహమాటంగా మాట్లాడడం తన నైజమని, ఇది తనకు ఇంటాబయట శత్రువులను పెంచిందని దువ్వాడ వివరించారు.
Admin
Studio18 News