Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Files Burns In AP : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు ప్రాంతాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు దగ్దమవుతున్న విషయం తెలిసిందే. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం కేసు ఇప్పటికే ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా.. అధికారులు కుట్రకోణం ఉందని గుర్తిచారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎక్కడ ఫైళ్లు పడేసినా, కాల్చివేసినా అక్రమార్కుల కుట్రగానే ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా పనికిరాని ఫైళ్లను పడేయాలన్నా అధికారులు, ఉద్యోగులు భయపడుతున్నారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కేసును సీఐడీకి అప్పగించగా.. కుట్ర కోణం ఉందని గుర్తించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ముద్దాలుగా ఉండటంతో పెద్దిరెడ్డి పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద పైళ్లు కాల్చివేత ఘటన.. తాజాగా పోలవరం భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లు దగ్దం ఘటన. ఇలా వరుస ఘటనలతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు, అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా.. పలు అరెస్టులు జరిగాయి. ఆదివారం తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కొన్ని ఫైల్స్ దగ్దమయ్యాయి. ధవళేశ్వరం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ (ఎల్ఎంసీ – ఎల్ఏ)కు చెందిన కాగితాలు దహనం ఘటనలో అధికారులు విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రాథమిక విచారణలో సంబంధిత పత్రాలు ప్రాధాన్యత లేనివిగా గుర్తించారు. అనప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్య వైఖరిగా భావించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కలెక్టర్.. ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్లకి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Admin
Studio18 News