Studio18 News - ANDHRA PRADESH / : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాఫ్టర్లు ఉపయోగించాలని సూచించారు. వందకు వంద శాతం ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Admin
Studio18 News