Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కృష్ణాజిల్లా పెడనకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కలిదిండి ఫణికుమార్ (40) బుడమేరు వరద నీటిలో చిక్కుకున్నాడు. అతను ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం వరదలో కొట్టుకుపోయింది. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఫణికుమార్ .. వినాయకచవితి పండుగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకున్నాడు. శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఫణికుమార్ .. సాయంత్రం తిరిగి పెడనకు కారులో బయలుదేరాడు. అయితే విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా ఫణికుమార్ వినకుండా కేసరపల్లి – ఉప్పుటూరు – కంకిపాడు మీదుగా వెళ్తానంటూ కారులో బయలుదేరాడు. అయితే బుడమేరు వాగు వరద నీటిలో అతను చిక్కుకున్నాడు. వరద ఉదృతికి కారు కొట్టుకుపోయింది. వరదలో చిక్కుకున్న అతనిని బయటకు తీసుకువచ్చేందుకు స్థానికుల సహాయంతో పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వరదలో గల్లంతైన ఫణికుమార్ కోసం ఆదివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. పండగకు ఇంటికి వచ్చిన ఫణికుమార్ బుడమేరు వరదలో చిక్కుకుపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Admin
Studio18 News