Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుందని, రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డిఏపి, ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం సేకరణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర పకడ్బందీగా ప్రతి రైతుకీ అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధం అవుతున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయని తెలిపారు. మారిన చట్టాలకు అనుగుణంగా అంతా ముందుకు వెళ్లాలన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనను తయారీదార్లు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎల్లవేళలా వినియోగదారుడి పక్షాన నిలబడుతుందని అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని అన్నారు. తయారీదార్లు, డీలర్లు రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలన్నారు. తొలుత తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి. రామ్ కుమార్ కొత్తగా వచ్చిన చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
Admin
Studio18 News