Studio18 News - ANDHRA PRADESH / : Budameru Flood : విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరులోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో గండ్లు పడి వరద నీరు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. ఫలితంగా మనిషిలోతు నీళ్లు రావడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించారు. పదిరోజులుగా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు భోజన సదుపాయాలు, తాగునీరు అందజేస్తుంది. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చి వేసింది. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో బాధితులు ఊపీరిపీల్చుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు బుడమేరులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర ఆదేశించారు.
Admin
Studio18 News