Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : బాలీవుడ్ సినీ నటి కాదంబరీ జత్వానీపై కేసు, వేధింపుల వ్యవహారం ఏపీ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఏపీ పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ కాదంబరీ జత్వానీ మీడియా ముందు కన్నీటిపర్యంతం అవ్వడం, ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నటి కాదంబరీపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ..ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు రికార్డులను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించిన సీపీ .. దీనిపై ఓ నివేదికను గురువారం డీజీపీకి అందజేశారు. అలానే పోలీస్ అధికారులపై నటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు గానూ సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్ ను విచారణ అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసు వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కాదంబరీ జత్వానీ ఈరోజు (శుక్రవారం) విజయవాడకు చేరుకుని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలవనున్నారు. తనపై, తన కుటుంబంపై నమోదైన కేసు, వేధింపులకు సంబంధించి వివరాలను వెల్లడించనున్నారు. తదుపరి ఈ కేసు విచారణ అధికారిగా నియమితులైన స్రవంతి రాయ్ .. నటి జత్వానీ నుండి వివరాలను నమోదు చేయనున్నారు. ఈ పరిణామాల క్రమంలో జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో కీలకపాత్రదారులుగా ఉన్నారని చెబుతున్న ఇద్దరు ఐపీఎస్‌ల చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న టాక్ నడుస్తోంది.
Admin
Studio18 News