Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Alla Ayodhya Rami Reddy: వైసీపీ నేతలు పలువురు పార్టీని వీడడం పట్ల ఆ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజ్యసభ సభ్యులు అందరూ పార్టీని వీడుతున్నారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఒకరిద్దరు పార్టీని వీడినప్పటికీ తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదని, మిగిలిన వారిమంతా పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తమ గురించి తాము ఇలా చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు. రాజకీయాన్ని, పదవులను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటే నష్టపోతారని హెచ్చరించారు. అన్ని అనుకున్నట్లే జరగాలంటే రాజకీయాల్లో అసాధ్యమని, వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడాలనుకుంటే రాజకీయాల్లో ఉండకూడదని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పారు. జగన్ సామాన్యుడి గురించి ఆలోచించే వ్యక్తి అని, ఎవరికి సాయం అవసరమో వారి కోసం జగన్ పార్టీ పెట్టారని తెలిపారు. ఏదేమైనా జగన్ వెంటే ప్రయాణం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మోపిదేవి అంటే తమకు ఇష్టమని, ఆయనకి మరింత బలం ఇవ్వడానికే ప్రయత్నించామని అన్నారు. ఇబ్బందులు ఉన్నాయని పార్టీలు మారిపోతే విలువలు ఉండవని, సమస్యలు ఉన్నప్పటికీ జగన్ వెంటే తాను ఉంటానని తెలిపారు.
Admin
Studio18 News