Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Tungabhadra Dam : తుంగభద్ర డ్యామ్ కు పెద్దెత్తున వరద నీరు పోటెత్తుతోంది. భారీగా నీరు చేరడంతో కొప్పళ జిల్లా మునీరాబాద్ సమీపంలోని తుంగభద్రత రిజర్వాయర్ 19వ గేటు చైన్ లింగ్ తెగడంతో కొట్టుకుపోయింది. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్క గేటు నుంచి 35వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 19వ గేటు నుంచి ప్రమాద స్థాయికి మించి నీరు ప్రవహిస్తుండటంతో డ్యాం పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గేటు మరమ్మతులు చేసే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యామ్ వద్ద ఊడిపోయిన గేటు ప్రాంతాన్ని కర్ణాటక ఎమ్మెల్యే రాఘవేద్ర హిట్నాల్, మంత్రి శివరాజ్ తంగడగి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు వస్తున్నారని తెలిపారు. రిజర్వాయర్ లో 65 టీఎంసీల నీటిని తగ్గించాల్సి ఉందని, డ్యామ్ లో 20 అడుగుల నీరు తగ్గిన తరువాతే గేటు మరమ్మతు పనులు ప్రారంభించవచ్చునని వెల్లడించారు. మరోవైపు తుంగభద్రత నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. తాజా ఘటనపై తుంగభద్ర ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం డ్యామ్ కు ఉన్న 33 గేట్ల నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. 69ఏళ్ల నాటి డ్యామ్ చరిత్రలో ఈ తరహా ఘటన జరగడం ఇదే ప్రథమం అని అన్నారు. తుంగభద్రత డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. అదేవిధంగా కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
Admin
Studio18 News