Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న కర్ణాటక పర్యటన సందర్భంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 40 ఏళ్ల కిందట సినిమాల్లో హీరోలు చెట్లను కాపాడే పాత్రలు పోషిస్తే, ఇప్పటి హీరోలు చెట్లను నరికే స్మగర్ల వేషాలు వేస్తున్నారని పవన్ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ 1973లో నటించిన 'గంధడ గుడి' అనే చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమాలో రాజ్ కుమార్ అడవుల్లోని చెట్లను నరకకుండా స్మగ్లర్లను, వేటగాళ్లను అడ్డుకుంటాడని పవన్ పేర్కొన్నారు. అయితే, పవన్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశాడంటూ ఓ వర్గం నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పుష్ప, పుష్ప-2 చిత్రాల్లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర పోషిస్తుండడంతో, ఇటీవల ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పవన్ ఈ విధంగా టార్గెట్ చేశాడని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు పలికిన విషయాన్ని మనసులో పెట్టుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. నటనలో అల్లు అర్జున్ కు పవన్ కల్యాణ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేడని కొందరు వ్యాఖ్యానించారు.
Admin
Studio18 News