Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సినిమాల స్ఫూర్తితో స్మగ్లర్లు కొత్తకొత్త పద్ధతుల్లో అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నం చేసిన ఓ స్మగ్లర్ సంగారెడ్డిలో పట్టుబడ్డాడు. కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని గంజాయిని తరలిస్తుండగా.. సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద దొరికిపోయాడు. నిందితుడు 83.4 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ఈ సరుకు విలువ సుమారు రూ.33.50 లక్షలు ఉండొచ్చని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున కంకోల్ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ కారులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఆ కారును ఆపి జాగ్రత్తగా పరిశీలించారు. కారు సీట్ల కింది భాగంలో ఓ ప్రత్యేక పెట్టె ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచి తీసుకెళుతున్నట్లు గుర్తించారు. డ్రైవర్ ను అరెస్టు చేసి గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఆ వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.
Admin
Studio18 News