Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, 26 జిల్లాల జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీలు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చుపెట్టాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు.
Admin
Studio18 News