Studio18 News - ANDHRA PRADESH / : Amaravati jungle clearance: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అడవిలా తయారైందని అన్నారు. ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి అమరావతి రాజధానిలో దట్టంగా పెరిగిపోయిన ముళ్లపొదల తొలగింపు పనులకు బుధవారం ఆయన శ్రీకారం చుట్టారు. వెలగపూడిలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు 40 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి నారాయణ ఈ సందర్బంగా తెలిపారు. ”రాజధాని నిర్మాణం కోసం మొదట్లో 41 వేల కోట్లతో టెండర్లు వేశాం. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది. ఇక్కడి రోడ్లు త్రవ్వేశారు. ఈ ప్రాంతాన్ని అడవి చేశారు. మొత్తం 58 వేల ఎకరాల్లో 24 వేల ఎకరాలు అడవి అయ్యింది. 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తాం. బిల్డింగ్స్, రోడ్లు పూర్తి చేస్తాం. ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చాక పనులు ప్రారంభిస్తాం. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ మరో ఐదేళ్లు పొడగిస్తున్నామ”ని మంత్రి నారాయణ చెప్పారు. ఈ రోజు సంతోషకరమైన రోజు: ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ అమరావతిపై ద్వేషంతో రాజధాని ప్రాంతాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారని ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ”ఈ రోజు సంతోషకరమైన రోజు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో 24, 230 ఎకరాలు చిట్టడవిగా మారిపోయింది. జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జగన్ ప్రజలపై వేసిన భారం ఇది. ఇక్కడి మెటీరియల్ దొంగలపాలైంది. కొన్నివేల కోట్లు ప్రజలపై జగన్ భారం పెట్టార”ని ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ విమర్శించారు. అమరావతిలో జోరందుకున్న నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి అమరావతిలో కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ (జంగిల్ క్లియరెన్స్) ప్రారంభమైంది. వీటిని తొలగించేందుకు CRDA రూ.36.50 కోట్లతో టెండర్లను పిలవగా NCCL సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Admin
Studio18 News