Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు అందరికీ నచ్చే ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొత్తగా ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తూ, బిర్యానీపై బంపర్ ఆఫర్ ప్రకటిస్తే జనాలు విరగబడ్డారు. దాంతో అందరికీ బిర్యానీ అందించలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. తాడేపల్లిగూడెంలోని ఉషా గ్రాండ్ వద్ద కొత్తగా బిర్యానీ హోటల్ తెరిచారు. రూ.2కే చికెన్ బిర్యానీ అని ప్రకటించారు. ఇంకేముంది... బిర్యానీ ప్రియులు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చిపడ్డారు. అయితే, హోటల్ నిర్వాహకులు 200 బిర్యానీ ప్యాకెట్లు మాత్రమే సిద్ధం చేయగా, అక్కడికి వచ్చిన వాళ్ల సంఖ్య 2 వేల వరకు ఉంటుంది. దాంతో బిర్యానీ ప్యాకెట్లు అందనివాళ్లు తీవ్ర నిరాశ చెందారు. బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రావాల్సి వచ్చింది. స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. జనానికి సర్దిచెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Admin
Studio18 News