Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయా.. అయినా ఎప్పుడూ ఒకేలా ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు నా కుటుంబం గురించి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా తన కుటుంబంలో జరుగుతున్న విషయాలపై ఆయన శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తన భార్య వాణి, కూతురు హైందవి చేస్తున్న ఆరోపణలపై, దివ్వెల మాధురితో తనకున్న సంబంధంపై పలు వివరాలను వెల్లడించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పనిచేశానని, చేస్తానని వివరించారు. భారత కుటుంబ వ్యవస్థలో భర్త అడుగుజాడల్లో నడిచే భార్యలను చూశానని దువ్వాడ చెప్పుకొచ్చారు. కానీ తన కుటుంబంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని వివరించారు. ముప్పై ఏళ్లుగా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నానని, ఇకపైనా కాపాడుకుంటానని చెప్పారు. నా కష్టాలను, నష్టాలను కుటుంబం దాకా చేరనివ్వలేదని వివరించారు. ఇద్దరు కూతుళ్లను డాక్టర్లను చేశానని, పెద్ద కూతురుకు వివాహం చేశానని తెలిపారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నా చేతికి అవినీతి మరక అంటుకోనివ్వలేదని, నిజాయతీకి కట్టుబడి పనిచేస్తున్నానని వివరించారు. ఈ క్రమంలో రాజకీయంగా, వ్యాపారపరంగా అనేకమంది శత్రువులను తయారుచేసుకున్నానని దువ్వాడ చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేసి చంపేస్తారో తెలియదని, తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ప్రాణాలతో ఉన్నన్ని రోజులు సంతోషంగా, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నదే తన లక్ష్యమని వివరించారు. అయితే, తనను చంపేయాలని కుట్రలు పన్నుతున్న వారిలో తన కుటుంబ సభ్యులు కూడా చేరడం బాధాకరమని వాపోయారు. ఎంత బాగా చూసుకుంటున్నా తన భార్య వాణి కుటుంబంలో గొడవలు చేసేదని, వ్యాపార సంస్థలను, మైన్స్ లను తన పేరు మీద రాయాలని ఎన్నోమార్లు గొడవ చేసిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. పిల్లల మనసుల్లో విషం నింపిందని, తండ్రిని నిలదీసేలా మార్చేసిందని మండిపడ్డారు. ప్రతీ కుటుంబంలోనూ గొడవలు వస్తాయని అయితే అవి నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలని చెప్పారు. కానీ తన భార్య వాణి మాత్రం రాజకీయ ఆకాంక్ష, డబ్బుపై ఆపేక్షతో గొడవ చేస్తోందని ఆరోపించారు. తాజాగా అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడికి వచ్చిందని చెప్పారు. భర్తను కలిసేందుకు వచ్చానని వాణి, తండ్రిని కలిసేందుకు వచ్చానని హైందవి చెబుతున్నారని గుర్తుచేస్తూ.. అర్ధరాత్రి భర్తను, తండ్రిని కలిసేందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనుచరులతో ఇంటి గోడను కూల్చి, డోర్ లాక్ ను రంపంతో కట్ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. వాణి, హైందవి, వారి అనుచరులను చూసి బయటకు వస్తే తనను చంపేసే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఇంట్లో నుంచి బయటకు రాలేదని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
Admin
Studio18 News