Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gossip Garage : దెబ్బ మీద దెబ్బ.. ఒకరి తర్వాత ఒకరు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని మరింత కుంగ దీస్తున్నారు… ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాలనే ఆందోళనో… కొత్త అవకాశాలు వెతుక్కునే ఆలోచనో కానీ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీకి బైబై చెప్పేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, నిన్న బాలినేని… ఇప్పుడు సామినేని ఉదయభాను పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఉదయభాను సొంత నియోజకవర్గం జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌తో సహా 18 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో సామినేని వైసీపీని వీడతారనే ప్రచారానికి బలం పెరిగింది? వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా చెప్పే ఉదయభానులో అసంతృప్తి దేనికి? ఉదయభాను కూడా వైసీపీకి రాం రాం చెప్పేస్తారా? మంత్రి పదవి రాలేదని చాలా కాలంగా అసంతృప్తి.. వైసీపీలో కీలక నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల గిరి, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు రాజీనామాలు చేశారు. ఇక నేడే రేపో మాజీ మంత్రి బాలినేని బైబై చెప్పేస్తారని ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో కూరుకుపోయిన వైసీపీకి షాక్‌నిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో విప్‌గా పనిచేసిన ఉదయభాను మంత్రి పదవి రాలేదని చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక పార్టీ కోలుకుంటుందా? లేదా? అన్న టెన్షన్‌తో పక్క చూపులు చూస్తున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో తనకంటే జూనియర్లకు మంత్రి పదవినిచ్చారని ఆగ్రహం.. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను మొత్తం మూడు సార్లు శాసనసభ్యుడిగా సేవలు అందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన ఉదయభాను…. వైఎస్ మరణాంతరం వైసీపీలో చేరారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్‌తోనే ఉన్నారు. గత ప్రభుత్వంలో జగన్ తనను మంత్రి చేస్తారని ఆశించారు ఉదయభాను. తొలి విడతలో దక్కపోయినా, రెండో విడతలోనైనా మంత్రి పదవి ఇస్తారని కలలు కన్నారట… కానీ, కృష్ణా జిల్లాలో తనకంటే జూనియర్లకు.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవినిచ్చిన జగన్ తనను పట్టించుకోలేదనే అసంతృప్తిలో కొంతకాలంగా పార్టీపై వ్యతిరేకత పెంచుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగి పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు. ఎన్నికలకు ముందే పార్టీ మారిపోదామనే ఆలోచన చేసినా కుదరలేదని, ఇక ఆలస్యం చేయడం నష్టమనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన వైపు ఉదయభాను చూపు? ప్రస్తుతం జగ్గయ్యపేట నియోజకవర్గ రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే… ఉదయభాను వైసీపీని వీడటం ఖాయమనే వాదనే వినిపిస్తోంది. ఆయన ముఖ్య అనుచరులు అంతా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ప్రధానంగా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతోపాటు 18 మంది కౌన్సిలర్లు మంత్రి లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సమయంలో ఉదయభాను కూడా వైసీపీని వీడతారని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వ్యాఖ్యానించారు. దీంతో ఉదయభానుపై ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది. ఇక ఉదయభాను నిజంగా వైసీపీని వీడతారా? ఒక వేళ వైసీపీకి బైబై చెప్పేస్తే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తి రేపుతోంది. టీడీపీలో ఎమ్మెల్యే సీటు ఖాళీ లేకపోవడం, ఆ స్థానంలో బలమైన నేత ఉండటంతో ఉదయభాను ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఉదయభానుకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి? వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో ఉదయభానుకి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఉదయభాను జనసేనలోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక ఆయనకు జనసేనలో సముచిత స్థానం కల్పిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. సమర్థుడు, సీనియర్ అన్న కారణంగా ఉదయభానుకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని అంటున్నారు. వైసీపీకి రాజీనామా చేయకుండానే జనసేనలో ఆయనకు పదవులు రిజర్వు కావడం పొలికల్ సర్కిల్స్‌లో చర్చకు దారితీస్తోంది.
Admin
Studio18 News