Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : kadambari jethwani case : ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. హన్మంతరావును డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా.. ప్రస్తుతం సత్యనారాయణ విజయవాడ గన్నవరపేట సీఐగా సత్యనారాయణ అన్నారు. ఏసీపీ హన్మంతరావు జెత్వానీ కేసు తరువాత బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా వెళ్లారు. అయినా, జెత్వానీ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్ లో కీలక పాత్ర పోషించాడని ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఓ పార్టీ నేత చేసిన ఫిర్యాదుపై అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆఘమేఘాల మీద అరెస్టు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరిపై పోలీసు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఇదిలాఉంటే.. కాదంబరి వ్యవహారంలో హనుమంతరావు, సత్యనారాయణతోపాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్‌ఐ పాత్ర ఉన్నట్టు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం. త్వరలో వారిపైనా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక ఇన్ స్పెక్టర్ విజయవాడలో, మరో ఇన్ స్పెక్టర్ ఏలూరు రేంజ్ లో, ఎస్ఐ కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తప్పుడు ఆరోపణలతో గత ప్రభుత్వం హయాంలో తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి శుక్రవారం ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ కు జెత్వానీ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫోర్జరీ పేరిట తనపై అక్రమ కేసు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఇందులో ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ముగ్గురు అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత నెల రోజులుగా ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. గత ప్రభుత్వంలోని పలువురు పోలీస్ అధికారులు, కొందరు అధికార పార్టీ నేతలు తనను నిర్భందించి ఇబ్బందులు పెట్టారని ఏపీ పోలీసులకు జత్వానీ గతంలో ఫిర్యాదు చేశారు. ముంబై నుంచి విజయవాడకు వచ్చిన ఆమెతోపాటు తన తండ్రి నరేంద్ర కుమార్ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ ప్రత్యేక అధికారిగా క్రైమ్స్ ఏసీపీ స్రవంతి రాయ్ కి బాధ్యతలు అప్పగించారు. తాజా ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. జెత్వాని ఫిర్యాదు మేరకు మరో ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News