Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్ కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పత్తి పరిశ్రమ సమస్యలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో 2017-18లో 20.50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగ్గా, 2023-24లో 11.58 లక్షల బేళ్ల ఉత్పత్తికి తగ్గిపోయిందన్నారు. ప్లాస్టిక్, గోనె సంచుల్లో పత్తిని ప్యాకింగ్ చేయడం వల్ల జిన్నింగ్ సమయంలో వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు. దీని వల్ల పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ధర కూడా తగ్గుతోందని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి అన్నారు. వంద శాతం ఈ- క్రాప్‌తో పత్తి రైతులకు మేలు : మంత్రి అచ్చెన్నాయుడు ఈ- క్రాప్‌లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ- క్రాప్‌లో నమోదు చేసిన పంటనంతా సీసీఐ కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధికి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ క్రాప్‌లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ధిపొందొచ్చునని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పత్తి దిగుడులు పెంపుదల, వ్యర్థాల నివారణపై మహారాష్ట్ర, తెలంగాణలో పరిస్థితులు అధ్యయనం చేసి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పత్తి సేకరణలో ప్లాస్టిక్ వినియోగంపై నివారణకు జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు.
Admin
Studio18 News