Studio18 News - ANDHRA PRADESH / : CM Jagan : కృష్ణా నదిలో వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. విజయవాడలోని పలు కాలనీల్లోకి పెద్దెత్తున వరదనీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, విజయవాడలోని కృష్ణలంక ఏరియాలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాజీ సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ వెళ్లారు. సోమవారం ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ వెంటనే ఆయన విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. మీరు సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా మా జీవితాలు అతలాకుతలం అయ్యేవని వారు పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇదిలాఉంటే.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. సింగ్ నగర్ తో సహా పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకోనున్నారు. మరోవైపు.. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని వైసీపీ నేత పోతినేని మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల ఏర్పాట్లలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. విజయవాడ నగర కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సహాయక కార్యక్రమాల ఏర్పాటులో, ముంపు ప్రమాదంపై ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. హోంమంత్రి అనిత రెండు నిమిషాలు సీతార సెంటర్లో నిలుచొని వెళ్లిపోయారు.. కనీసం ముంపు భారిన పడిన ప్రజలను ఒక్కరినికూడా పరామర్శించలేదు. గంటలు గంటలు రివ్వ్యూలు వల్ల ఉపయోగం లేదు. సహాయక కార్యక్రమాలపై దృష్టిసారించాలని పోతిన మహేశ్ అన్నారు.
Admin
Studio18 News