Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కమ్మ కుల పార్టీ టీడీపీలోకి వచ్చేందుకు తాను ప్రయత్నించానా అని అచ్చెన్నపై విజయసాయి మండిపడ్డ సంగతి తెలిసిందే. అచ్చెన్న శరీరాకృతిని కించపరిచే వ్యాఖ్యలు కూడా చేశారు. విజయసాయి వ్యాఖ్యలకు అచ్చెన్న అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డీ... నీలాగా ఆర్థిక దోపిడీ చేసే దుర్మార్గపు బుద్ధి, ఆర్థిక నేరాలకు సలహాలు ఇచ్చే దరిద్రపు బుద్ధి మాకు, మా పార్టీ వాళ్ళకు లేవు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. "పంచభూతాలను కూడా కబ్జా చేసే పరమ నికృష్ట మనిషివి... వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడే సంస్కారాన్ని బట్టి నీకు చాలా తీవ్రమైన మానసిక సమస్య ఉందని అర్థమవుతోంది... కర్మ నీ దూల తీర్చే సమయం వచ్చింది... సుదీర్ఘకాలం జైలు జీవితానికి సిద్ధంగా ఉండు" అని పేర్కొన్నారు. భగవంతుడు తమకు ప్రజలకు సేవ చేసే బుద్ధి ఇచ్చాడని అచ్చెన్న వివరించారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని గ్రహించి వైసీపీ నుంచి టీడీపీలోకి వద్దామని నీవు విశ్వప్రయత్నాలు చేశావంటూ ఎద్దేవా చేశారు. నీలాంటి నేరగాళ్లకు, ఆర్థిక ఉన్మాదులకు టీడీపీలో స్థానం లేదని తేల్చడంతో దిక్కు తోచక పిచ్చి వాగుడు వాగుతున్నావు అని దుయ్యబట్టారు. నువ్వు, నీ నాయకుడు జగన్ ఎన్ని వేషాలు వేసినా... మీ పాపం పండింది, చేసిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు.
Admin
Studio18 News