Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. పల్లె పండుగ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కంకిపాడులో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంట్ రోడ్లు, రూ. 4.15 లక్షలతో నిర్మించే రెండు గోకులాలు, పునాదిపాడులో రూ. 54 లక్షలతో నిర్మించే రెండు రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. కంకిపాడులోని టీడీపీ కార్యాలయం ఆవరణలో సభను నిర్వహించనున్నారు. ఇంకోవైపు, కంకిపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొననున్నారు.
Admin
Studio18 News