Studio18 News - ANDHRA PRADESH / : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు (శుక్రవారం) టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చలు జరపనున్నారు. అదే విధంగా పార్టీలో పదవులు ఆశించకుండా పని చేసిన నాయకులు, ఇప్పటికే పదవులు దక్కిన నేతల పనితీరు గురించి కూడా చర్చిస్తారు. ఇక ఇసుక తవ్వకాలు, మద్యం షాపుల నిర్వహణ విషయాల్లో పలు ప్రాంతాల్లోని కూటమి నేతల జోక్యంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేలకు సున్నితంగా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇసుక రవాణా, మద్యం షాపుల విషయాల్లో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని వార్తలు రావడంతో ఇప్పటికే చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ఆస్కారం లేని విధంగా కూటమి నేతల వ్యవహార శైలి ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించే నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకోనున్నారన్న సమాచారంతో వారి గుండెల్లో గుబులు రేగుతోందని అంటున్నారు.
Admin
Studio18 News