Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతోంది. ఈ పథకం కింద, చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుండటంతో అనేక కుటుంబాలు, ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలున్నవారు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆనందం గురించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 'ఎక్స్' సామాజిక మాధ్యమ వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఒక ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లల చదువుల నిమిత్తం 'తల్లికి వందనం' కింద ఏకంగా రూ.1.56 లక్షలు జమ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడంతో ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆ తల్లులు అపరిమితమైన సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ తల్లులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే తరహాలో, కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన చాంద్‌బాషా, షకినాబి దంపతుల కుటుంబం కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందింది. వారికి ఆరుగురు కుమార్తెలు ఉండగా, వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. 'తల్లికి వందనం' పథకానికి వీరంతా అర్హత సాధించడంతో, వారి తల్లి షకినాబి ఖాతాలో ఇప్పటివరకు రూ.78,000 జమ అయ్యాయని విద్యార్థుల తండ్రి చాంద్‌బాషా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు
Admin
Studio18 News