Studio18 News - ANDHRA PRADESH / : జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె స్పందించారు. పవన్ కల్యాణ్ ... చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని... ఇప్పుడు ఆయన మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. జనసేన పార్టీని 'ఆంధ్ర మత సేన' పార్టీగా మార్చారని వ్యాఖ్యానించారు. "జనసేన... జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కొని, బీజేపీ మైకం నుంచి బయట పడాలి" అని షర్మిల హితవు పలికారు.
Admin
Studio18 News