Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా, గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలక వ్యక్తిగా కొనసాగిన ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ ఢిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండడమే అందుకు కారణం. దీనిపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సజ్జలపై లుకౌట్ నోటీసులు ఉన్నందునే ఆయనను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీ చేశారని వెల్లడించారు. ఆ కేసుకు సంబంధించిన సజ్జలను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వివరించారు. ఇక, తిరుమల లడ్డూ అంశంపైనా డీజీపీ స్పందించారు. లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పబట్టలేదని స్పష్టం చేశారు. స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటు చేస్తామని సుప్రీం చెప్పిందని వివరణ ఇచ్చారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించిందని... ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం నుంచి సిట్ కు ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ లు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ సిట్ ఓ స్వతంత్ర విచారణ సంస్థలాగా పనిచేస్తుందని, ఇందులో రాష్ట్ర పోలీసులు జోక్యం ఉందని డీజీపీ స్పష్టం చేశారు.
Admin
Studio18 News