Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ap Liquor Shop Lottery : ఏపీ వ్యాప్తంగా 3వేల 396 మద్యం దుకాణాలకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వాటిని పున:పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 దుకాణాలకు అత్యధికంగా 5వేల 764 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు విధించనుంది. క్వార్టర్ బాటిల్ ను 99 రూపాయలకే విక్రయించేలా సవరణ చేసింది. ఏపీలో నూతన మద్యం విధానం అమలు చేసేందుకు సమయం వచ్చేసింది. ఇటీవలే టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ టెండర్లు ఓపెన్ చేసి లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయించనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యక్తులకు 15వ తేదీన వారికి సంబంధించిన షాపులను అప్పగిస్తారు. 16వ తేదీ నుంచి షాపులకు కొత్త మద్యాన్ని అందజేస్తారు. అదే రోజున మద్యం విక్రయాలు జరగనున్నాయి. మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వం ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో నాన్ రీఫండబుల్ ఫీజు కింద ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. అంతకుమించి ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు వివిధ జిల్లాల్లో దాదాపుగా ఒక్కో దుకాణానికి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున చూసుకుంటే ఒక్కో షాపుకి 25 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. మ్యానువల్ పద్ధతిలో డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు అధికారులు.
Admin
Studio18 News